సిద్దాంతం నోటి దుర్వాసనలాంటిది – కంపు తెలిసేది పక్కోడికే..!!

చి చీ.. యెదవ బ్లాగు, యెదవ టపాలు. ఎన్ని రాస్తే ఏం లాభం. నా కామెంట్ల యావ తీరలేదు. పోనీ కామెంట్లు రాయకపోతే పోయారు.. కనీసం రేటింగులన్నా ఇచ్చారా అంటే అదీ లేదు. అటుపక్క, మా మలకుపేట రౌడీ, సింగిల్ లైను పోస్టు ఒకటి వేస్తే పొలోమని కామెంట్లు రాసేత్తన్నారు. నేనేమి చేసేదిరా నాయనోయ్. ఎలా, పాపులరవ్వడం ఎలా? కామెంట్లు కొట్టడం ఎలా? రేటింగులు కొట్టడం ఎలా? కనీసం 200 కామెంట్లన్నా ఒక్కో టపాకి రానిదే నిద్రకూడా రావడం లేదే. యేమి చేయాలి నేనిప్పుడు.

అవిడియా…

అన్నా హజారే నిరాహార దీక్షవెనుక కొన్ని రాజకీయ, మతతత్వ శక్తులున్నాయని అనుమానాలు వ్యక్తం చేసి రాసేస్తే, యావత్ ప్రపంచానికి పూజ్యనీయులు అయిన కమ్యూనిస్టులను నిరాహార దీక్షకు ఆహ్వానించలేదు.అంతేనా, తగుదునమ్మా అని నరేంద్ర మోడీని పొగుడుతాడా? హన్నా.. ఎంత ధైర్యము..చెప్తా, “అన్నా”కు  ఝలకిస్తా..!!

అసలు రాముడు లేడని రాసేస్తే. రాం గోపాల్ వర్మ అలానే కదా రాస్తోంది. మనం కొత్తగా, ఇంకా కొత్తగా ఏదో ఒకటీ రాయాలి. ఏమి రాయాలి? హా.. రామాయణములో సీతకు తన తండ్రి ఆస్తిపంచి ఇవ్వలేదు కాబట్టి, అతను స్త్రీల హక్కులను గౌరవించలేదని చెప్పేస్తే..!!

అంతేనా, సీతను పెల్లాడిన తరువాత రాముడు కట్న కానుకలు తీసుకున్నాడట, దొరికాడు.. వరకట్నం తీసుకున్నందుకు రాముని మీద కేసు పెట్టాలని డిమాండు చేసేస్తే..!!

లక్ష్మణుడు, తన భార్యను వదిలి రామునితో వెల్లాడట..ఇంకేం,  అతని మీద గృహహింస కేసు పెట్టాలని అతన్ని పాపులర్ చేసినదుకు రామాయనాన్ని సపోర్టు చేసే అందరిమీదా గృహహింస కింద కేసు పెట్టాలని డిమాండు చేసేస్తే..!!

అయినా, శూర్పనఖ ముక్కూ చెవులూ కోసి పంపిన లక్స్మనుని మీద ఇంత చిన్న కేసా. ఆసిడు దాడులు చేస్తున్న ప్రేమోన్మాది మీద పెట్టిన కేసులన్నీ లక్ష్మనుని మీద పెట్టాలని డిమాండు చేసేస్తే..!!

ఇక భారతమైతే మరీనూ…

100 మంది పిల్లల్ని కంటారా? ఫ్యామిలీ ప్లానింగు పాటించాలన్న తెలివే లేదా? కాకపోతే, ద్రౌపదికి ఐదుగురు భర్తలను ఇచ్చి కాస్త సమానత్వం చూపించారు, అది తప్పితే అన్నీ దారుణాలే.

హన్నా..! భార్యను జూదములో పెట్టిన అతని పేరు ధర్మరాజా? హెంత కామెడీ? 1600 మంది గోపికలతో, 8 మంది భార్యలతో ఉండే క్రిష్ణుడు దేవుడా..!! యెంత దారుణం, స్త్రీల హక్కులు వీరికి అసలు పట్టవా? స్త్రీలను గౌరవించని భారతం అసలు కావ్యమే కాదు.

అందుకే  రామాయణం రంకు, భారతం బొంకు అనేద్దాం. ఓ పనైపోతుంది. పనిలో పని మనకు పిచ్చ పాపులారిటీ వస్తుంది.

చలం రాసిన మైదానం ఒక అపూర్వ కావ్యం. అందులో ఒక స్త్రీ మరో మగానితో లేచిపోవడం చారిత్రాత్మిక ఘట్టం. అలా వెల్లడం తప్పెందుకవుతుంది. చలాన్ని విమర్శించే వారు అప్పుడున్న సామాజిక పరిస్తితులను పరిగణలోకి తీసుకోలేదని చెప్పాలి… కాకపోతే రామాయణ, మహాభారత కాలం నాటీ పరిస్థితులను నేను లెక్కలోకి తీసుకోను. అది అంతే. వాటిని పట్టించుకుంటే నా “విషవృక్షాన్ని”   పెంచి పోషించడం ఎలా?  రామాయణాలు, మహాభారతాలు, అందులోని ఆదర్శపురుషులూ ఈ కాలం చట్టాలకూ, ఈ కాలం కట్టుబాట్లకూ అనుగుణంగా ఉండాలి. లేకపోతే అదంతా రంకంటా.. లేకపోతే బొంకంటా, విషవృక్షాలు రాసేత్తా. నా ఇష్టం.

మార్స్క్సులు చెప్పిన సిద్దాంతాలు, ఏంగెల్లు సెప్పిన సిద్దాంతాలు ఎంత లోపబూయిస్టమైనవో ఎంతో మంది విడమరిచి చెప్పినా అవన్నీ నాకనవసరం. సిద్దాంతం అనేది నోటి దుర్వాసన లాంటిది .. ఆ కంపు తెలిసేది పక్కోడికే అని ఎందరు చెప్పినా నేను విన్ను. నా సిద్దాంతమే  అందరికీ ఆదర్శనీయమని రాసేత్తా. చూద్దాం కామెంట్లు రాకుండా ఎలా పోతాయో..!!

Advertisements
Published in: on April 14, 2011 at 11:47 am  Comments Off on సిద్దాంతం నోటి దుర్వాసనలాంటిది – కంపు తెలిసేది పక్కోడికే..!!  
Tags: , , , ,
%d bloggers like this: