498A చట్టం దుర్వినియోగాన్ని సీరియస్ గా తీసుకోవడం ఎందుకు?

498A చట్టం దుర్వినియోగాన్ని సీరియస్ గా తీసుకోవడం ఎందుకు?

ఇదీ ఓమేతావి అడిగిన ప్రశ్న. బావుంది. దుర్వినియోగం అన్నిచోట్లా జరుగుతోంది. దొంగ తనాల కేసులు దుర్వినియోగ మవుతున్నాయి. రేపు కేసులు కూడా దుర్వినియోగ మవుతున్నాయి, అందుకని రేప్ చేసినవారిని శిక్షించడానికి ఉద్దేశించిన చట్టాలను తొలగించాలా? ఇదివారి ఇంకో ప్రశ్న. ఈ ప్రశ్న మరీ బావుంది.

సరే దొంగతనాలపై కేసులనూ, రేప్ కేసులనూ ఒకసారి పరిశీలిద్దాం. దొంగ తనం జరిగింది అని అభియోగం వస్తే ఎవరిని అరెస్టు చేస్తారు? ఎలా అరెస్టు చేస్తారు? ఒక కుటుంభాన్ని మొత్తం అరెస్టు చేస్తారా? అందులోని 70 సంవత్సరాలు దాటిన వృద్దులనూ, మూడు నాలుగేళ్ళు కూడా లేని చిన్నారులనూ దొంగల కింద అరెస్టు చేస్తారా? చేయరు. కానీ 498A కేసులలో మాత్రం అరెస్టుచేస్తారు.

దొంగతనం కేసులో అరెస్టులు ఎలా జరుగుతాయి, ఏ సాక్షాలూ లేకున్నా, అసలు దొంగతనం చేశాడు అన్న వ్యక్తి ఆప్రదేశములో, కాదు కాదు, ఆవూరిలో లేకున్న కూడా అరెస్టు చేస్తారా? చేయరు. దానికి ఓపద్దతుంటుంది. కానీ, 498A కేసులలో అలా కాదు, కేసు పెట్టడాం ఆలస్యం, అది నిజమా కాదా అన్న దానితో సంబందం లేకుండా, ఆస్త్రీ నిజమే చెబుతున్నది అని నిర్ధారణకు వచ్చేసి అరెస్టు చేయడం జరుగుతుంది. సాక్షాలు గట్రా ఏమీ అక్కరలేదు.

ఇక రేప్ కేసుల విషయములో కూడా అంతే. రేప్ చేసిన వారినే అరెస్టు చేస్తారు, కుటుంభం మొత్తాన్ని కాదు. అందులో చిన్న పిల్లలనూ, ఆడావారినీ అందరినీ అరెస్టుచేయడం ఉండదు.

498A అనేది…

  • కాగ్నిజబుల్ అఫెన్స్ – అంటే, క్రిమినల్ కేసన్న మాట. పోలీసులకు అరెస్టు చేయడానికి అన్ని అధికారాలూ ఉంటాయి. కోర్టూ దగ్గరనుండి, అరెస్టు వారంటు తెచ్చుకోవాల్సిన పనిలేదు. స్త్రీ ఎవరి పేరు చెప్పిందో వారందరిని లోపల తోసేయచ్చు.
  • నాన్-బెయిలబుల్ – అంటే, జామీను ఇచ్చి బయటికి తీసుకు రావడం లాంటివి కుదరదు. ఖచ్ఛితంగా కేసు కోర్టుకు వెల్లాలి. అక్కడ జడ్జిగారు మాత్రమే పూర్వాపరాలు పరిశీలించి బెయిల్ మంజూరు చేయగలరు (చాలా సార్లు బెయిల్ దొరకదు)
  • నాన్-కాంపౌండబుల్ – అంటే, కేసు పెట్టిన స్త్రీ సైతం ఆ కేసును తరువాత వెనక్కి తీసుకోలేదు. అది కోర్టుకు వెల్లాల్సిందే, పూర్తి స్థాయి విచారణ జరిగి ఆయా వ్యక్తులందరూ నిర్దోషిగా నిరూపించుకుని బయటకి రావాల్సిందే. మరో మార్గం లేదు.

ఇంకో విషయం ఏమిటంటే, మిగిలిన అన్ని చట్టాలలో (ఏవో కొన్ని మినహా) నేరం నిరూపించబడేంత వరకూ అతను నిర్ధోషే, కానీ ఈ కేసుల్లో మాత్రం, వారు నేరం చేయలేదు అని తమను తాము నిరూపించుకునేంత వరకూ చట్టం వారిని దోషులుగా పరిగణిస్తుంది. ఇది మానవ హక్కుల ఉల్లంఘనే. కానీ, స్త్రీలకోసం రాజ్యాంగం కల్పించిన కొన్ని ప్రత్యేక వెసులుబాటులను ఆధారంగా చేసుకుని, ఇలాంటి చట్టాలను చేయడం జరుగుతోంది. అప్పుడెప్పుడో టాడా, పోటా అనే కేసులుండేవి. ఈ 498Aని కొన్ని కొన్ని అంశాలలో వాటితో పోల్చచ్చు.

స్త్రీలకోసం చేయబడ్డ ఈచట్టము అదే స్త్రీలను చాలా ఇబ్బందులకు గురిచేస్తోంది. స్త్రీవాదులు మాత్రం తప్పు చేస్తే స్త్రీ అయినా పురుషుడైనా శిక్ష ఎదుర్కోక తప్పదు అని సినిమా డయిలాగులు చెబుతారు కానీ, అదే స్త్రీ ఈచట్టాలను దుర్వినియోగ చేసి తప్పు చేస్తున్నప్పుడు ఆమెను శిక్షించడానికి ఎందుకు కుదరదు అంటే మాత్రం పచ్చి వెలక్కాయ నోటికి అడ్డం పడ్డట్టు మాటలు మింగేస్తారు, లేదా మరో సినిమా డయిలాగు ఏదో ఒకటి చెబుతారు.

(పెద్దదిగా చూడడానికి ఇమేజ్ పై క్లిక్ చేయండి)

498a_statistics_page_1
చూశారుగా ప్రతీ సంవత్సరం ఎంత మంది స్త్రీలు దీని కారణంగా జైలు కెలుతున్నారో. పోనీ వారంతా తప్పు చేసిన వారా అంటే కాదాయే. అందులో చాలా మంది దాదాపుగా 80% పైనే స్త్రీలు నిర్దోషులే. వారంతా కేవలం ఒక మగాడికి అక్కా, తల్లి, చెల్లి లేదా మరో బంధువు అయినందుకు అలా ఇబ్బందులు ఎదుర్కోబడ్డవారే.

2009 లెక్కల ప్రకారం, వివిధ నేరాలు చేసి అరెస్టయిన స్త్రీలలో నాలుగురికి ఒకరు వరకట్న సంబందిత కారణంగానే అరెస్టు కాబడ్డారంటే అర్థం చేసుకోవచ్చు. అది ఎంత తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోందో. వారిలో కొంతమంది 18 యేల్ల లోపు బాలికలు కూడా ఉన్నారు. ఈవార్తను చదవండి..

One in four women arrested for dowry-related crimes

ఈచట్టం కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న వారిలో వయసులో పెద్దవారు చాలా మందే ఉన్నారు. పెద్దలను ఇబ్బంది పెట్టేవారు అనగానే తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు అని మగాళ్ళను నిందించడం మాత్రమే మనకు తెలుసు, కానీ ఈ చట్టం కారణంగా చాలా మంది వయసు మళ్ళిన వారు అరెస్టయ్యారు. నానా ఇబ్బందులు పడ్డారు.

RTI ఉపయోగించి తెలుసుకున్న లెక్కల ప్రకారం ఒక్క 2005లోనే

18-60 సంవత్సరాల వయస్సు వారు 129655 (96%), 60 సంవత్సరాలు పైబడిన వారు 4744 (3.55%) ఉన్నారట. ఇది కేవలం 2005 సంవత్సరానికి చెందిన లెక్కలు మాత్రమే. ప్రతీ సంవత్సరం ఇది పెరుగుతూనే ఉందికానీ తగ్గడం లేదు. ఇంకో విషయం పైన లెక్కలలో 18-60 సంవత్సరాల వారినందరినీ ఒకే గ్రూపుగానే విభజించారు. నిజానికి 50-60 సంవత్సరాల వారిని కూడా వృద్దులుగా తీసుకుంటే, ఈచట్టం భారిన పడిన వృద్దుల జాబితా మరింత పెద్దదిగా ఉండేది.

World Health Organization వారి రిపోర్టుల ప్రకారం వయసు మళ్ళీనవారిని చట్ట పరంగా హింసించే దేశాలలో మనం లెబనానుతో కలిసి అగ్రస్థానములో నిలిచాం. ( Document no WHO/NMH/VIP/02.1,WHO/NMH/NPH//02.2 Title Missing Voices. http://whqlibdoc.who.int/hq/2002/WHO_NMH_VIP_02.1.pdf) ఇందులో 498A చట్టము వయసుమల్లిన వారి హింసకు కారణమవుతోందని క్లియరుగా చెప్పడం జరిగింది.

దొంగతనాలపై చేసిన చట్టాలు, రేప్ కేసులూ దుర్వినియోగ మవుతున్నా, 498A ఎందుకు ప్రత్యేక మైనదో చెప్పాను కదా, మరి 498A ఎందుకు తొలగించాలని కోరుతున్నానో అదీ చెబుతా. ఒక నేరాన్ని శిక్షించడానికి రెండు మూడు చట్టాలు అవసరం లేదు. 498A అంతే అందరూ వరకట్న నిరోధక చట్టం అనుకుంటు ఉంటారు కానీ అది నిజం కాదు. అది కేవలం స్త్రీలపై హింసను ఉద్దేశించి చేసిన చట్టం. కానీ, వరకట్నం అడగడం కూడా హింసకిందికే వస్తుంది కాబట్టి, 498Aను వరకట్నం కేసుల్లో కూడా వాడతారు. స్త్రీలపై హింసను అరికట్టడానికి ప్రస్తుతం గృహహింస్ నిరోధక చట్టం కూడా ఉంది. ఇది 498A కూడా కవర్ చేయని చాలా నేరాలను కవర్ చేస్తుంది. అంటే ఇది సూపర్ సెట్ అన్నమాట. మరి ఒక నేరానికి రెండు చట్టాలుండడం అవసరమా? 498Aలాంటి అతిగా దుర్వినియోగం చేసే చట్టాలను తీసేసినా వచ్చే నష్టం ఏమీలేదు. అందుకే దాన్ని తీసేయమని చెప్పడం జరుగుతోంది.

కాబట్టి కామ్రేడ్, ఆలోచించండి. తమరి దృష్టిలో స్త్రీలంటే కేవలం వయసులో ఉన్న అమ్మాయిలే అయితే మేము చేయగలిగింది ఏమీలేదు. (వారుకూడా దీని భారిన పడ్డారనుకోండి). లేదా కేవలం భార్యలు మాత్రమే అయితే ఆవిషయాన్ని చెప్పేయండి.. అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. లేకపోతే 498A దుర్వినియోగంపై చేసే అందోళనను ఏడుపు అంటూ నాలుకను వంకర్లు తిప్పడం మానుకోండి.

అయినా, జనాల ప్రాణాలను బలిగొనే మావోయిస్టులకూ, మత మౌఢ్యముతో విరుచుకు పడే కసబ్ లాంటి తీవ్రవాదులకూ మానవ హక్కులుండాలనే వీర మానవహక్కుల కార్యకర్తలు, మగవారినీ, వారి బందువు అయిన పాపానికి ఆడవారినీ ఇంత దారుణంగా హింసిస్తుంతే సమర్ధిస్తారెందుకు?

Advertisements

The URI to TrackBack this entry is: https://vishwaveekshanam.wordpress.com/2013/03/16/498a-%e0%b0%9a%e0%b0%9f%e0%b1%8d%e0%b0%9f%e0%b0%82-%e0%b0%a6%e0%b1%81%e0%b0%b0%e0%b1%8d%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a8%e0%b0%bf%e0%b0%af%e0%b1%8b%e0%b0%97%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d%e0%b0%a8%e0%b0%bf/trackback/

%d bloggers like this: