జియాఖాన్ ఆత్మహత్య ఒక విధంగా, సయెద్ మక్ధూం ఆత్మహత్య మరో విధంగా … ఎందుకీ వివక్ష??

జియాఖాన్ ఆత్మహత్య ఒక బాధాకరమైన సంఘఠన. ఆమె రాసినట్టుగా చెబుతున్న చివరి ఉత్తరంలో మనకు ఆమె ప్రేమ కనపడుతుంది, ఆవేదన కనపడుతుంది. ఆ ప్రేమను అందుకోలేని వ్యక్తులను మీద జాలి కలుగుతుంది, కోపం కలుగుతుంది. అది సహజం. ఆత్మహత్యలు పిరికి వారు మాత్రమే చేసుకుంటారు, ఆత్మ హత్య దేనికీ పరిష్కారం కాదు లాంటి మాటలన్నీ మనం వినడానికి బాగానే ఉంటాయి. కానీ, ఆ క్షణం, ఆ వ్యక్తి మానసిక పరిస్థితి వీటిని పట్టించుకునే స్థితిలో ఉండదు. అందుకే ఇవి జరుగుతూనే ఉంటాయి.

కానీ ఇక్కడ కొన్ని ప్రశ్నలు సమాధానంలేనివిగా మిగిలి పోయాయి. వాటిలోకి వెల్లే ముందు, నేను మీకు మరో ఆత్మ హత్య గురించి చెప్పదలుచుకున్నాను. అది ఒక సాధారణ మగవాడి ఆత్మహత్య. ఓ తండ్రి ఆత్మహత్య. అతను హీరో కాదు, పేరు ప్రఖ్యాతులు ఉన్నవాడు కాదు. ఒక సాధారణ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అతని పేరు సయ్యద్ అహ్మద్ మక్ధూం. ఇతను కెనడియన్ పౌరుడు, భారత దేశములో వర్కింగ్ పర్మిట్‌తో ఉండేవాడు. ఇక్కడ పెళ్ళికూడా చేసుకున్నాడు. అతని భార్య పేరు ముస్కాన్. ఆమె ఒక కంపెనీలో హె.ఆర్ గా పని చేసేది.

ఇక్కడ అతని భార్య ముస్కాన్ గురించి కాస్త చెప్పుకోవాలి. ముస్కాన్, మక్ధూంను పెళ్ళి చేసుకోక మునుపే మరో ఇద్దరిని మూడు సార్లు పెళ్ళిచేసుకుంది. ఆపెళ్ళిల్లు వేరే వేరే పేర్లతో చేసుకుంది.

  1. మొదటి వివాహం అస్లం జావీద్ తో 1997లో జరిగింది. అతనికి 1998లోనే విడాకులు ఇచ్చింది. అదికూడా విడాకుల పత్రంపై సంతకం పెట్టకపోతే 498Aకేసులు పెడతానని బెదిరించి విడాకులు తీసుకుంది.
  2. మొదటి భర్త వలన తనకు కలిగిన గర్భాన్ని అబార్షన్ ద్వారా తొలగించుకుని, కోరమంగళలో (బెంగులూరులోని కాస్ట్‌లీ లొకాలిటీ) నివసించే ఇంతియాజ్ అహ్మద్ ను పెళ్ళిచేసుకుంది. అది కూడా తన పేరును “అతికా తజీన్” అని మార్చుకుని చేసుకుంది. పేరు మారింది కానీ, గుణం కాదు. రెండో భర్త, ఇంతియాజ్ ను కూడ బెదిరించి అతని వద్దనుండి పెద్ద మొత్తములో డబ్బు, నగలు గుంజుకుని, అతనికి కూడా విడాకులు ఇచ్చింది.
  3. ముచ్చటగా మూడో సారి, తిరిగి తన మొదటి భర్తకే వెల్లింది, “అతికా అసలాం” అని పేరు మార్చుకుంది. కానీ, మొదటి భర్తకు ఆమె అబార్షన్ చేయించుకుని, తమకు పుట్టబోయే బిడ్డను వదిలించుకుంది అని తెలిసిన తరువాత, ఇంటిలో ఉన్న నగలూ, డబ్బుతో … ఆమె, ఆమె కుటుంబం చెన్నైనుండి అదృష్యమైపోయారు. పోతూ, పోతూ అతని మీద క్రిమినల్ కేసులు పెట్టి మరీ పోయారు. ఈ సారి, ఈ మూడో పెళ్ళికిగానూ, ఆమె చట్టపరంగా విడాకులూ ఇవ్వలేదు, మత పరమైన తలాక్ కానీ ఇవ్వలేదు. ఈ వివాహ బంధం లీగల్‌గా అలానె ఉందని ఆమె మొదటీ మరియూ మూడవ భర్త చెబుతున్నాడు.
  4. తరువాత ఆమె బెంగులూరుకు వచ్చింది. అక్కడ ముస్కాన్ సెహర్ అని పేరు మార్చుకుంది. (ముస్కాన్ జెహర్ అని పెట్టుకునుంటే బాగా సూటయ్యుండేది). షాదీ డాట్ కాం అనే మ్యాట్రిమోనియల్ సైటులో “ఆస్మీన్” అనే పేరుతో ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకుంది. అక్కడె సయెద్ మక్ధూంను కలుసుకుంది. నాలుగవ పెళ్ళి జరిగింది. ఆమె తను ఇదివరకే పెళ్ళిచేసుకున్నానని, విడాకులు తీసుకున్నానని చెప్పిందే కానీ, మూడు వివాహాలు చేసుకుని, విడాకులు తీసుకుందని చెప్పలేదు. పెళ్ళికూడ సయద్ మక్ధూం కెనడనుండి, ఇండియాకి వచ్చిన రోజుల్లో హడావుడిగా జరిగిపోయింది.

కథ మళ్ళీ మామూలే. డబ్బుకోసం ఆవిడ మక్ధూంను వేధించడం మొదలు పెట్టింది. అంతే కాడు. వారికిపుట్టిన బిడ్డ “సయెద్ రియాన్” ను సరిగా చూసుకోవడం మానేసింది. విడాకులు కోరుతూ, అతను వరకట్నం కోసం వేధిస్తున్నాడు అని తప్పుడు 498A కేసు పెట్టింది. తన బిడ్డను కలవడానికి అతనికి అవకాశం కూడా లేకుండా చేసింది.

ఇక్కడ సయ్యద్ మక్ధూం గురించి కూడా కాస్త చెప్పుకోవాలి. ముస్కాన్ తో వివాహం అతనికి రెండవది. మొదట, కెనడాలో వివాహం చేసుకున్నాడు. అది వీగిపోవడాముతో, ఇండియాలో ముస్కాన్‌ను పెళ్ళిచేసుకున్నాడు. అది కూడా చెడిపోవడముతో మూడో పెళ్ళి చేసుకున్నాడు.

ఏప్రిల్ 5, 2009. గర్భవతి అయిన తన మూడవ భార్యను పుట్టింటికి సాగనంపి, ఇంటికి వచ్చాడు. ఆరోజు అతను ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి కొన్ని నిమిషాల ముందు తాను ఆత్మహత్య ఎందుకు చేసుకుంటున్నాను అన్నది తెలియజేస్తూ తన వద్దనున్న మొబైల్‌లో వీడియో రికార్డింగ్ చేశాడు.

ఒక స్త్రీ ఆత్మహత్య చేసుకుంటే బోలెడంత సింపతీ చూపించే వారు, అదే పురుషుడు ఆత్మహత్య చేసుకుంటే అతని గురించి ఎంతో హీనంగా మట్లాడుతారు. “మగవాడిలా బతుకు (Be a Man)” అంటూ మట్లాడేవారి దగ్గరనుండి, అతన్ని కించపరుస్తూ వార్తలు ప్రసారం చేసిన వారు కూడా ఉన్నారు. కానీ, News 9 ఛానెల్ మరికొన్ని పత్రికలు అతనిపై కాస్త సానుభూతిని ప్రదర్శించాయి. అందులో న్యూస్ 9 చేసిన ప్రోగ్రాం చూస్తే, జరిగింది మరింత వివరంగా అర్థమవుతుంది …

పైన విడియోలో అతనికి అతని కొడుకంతే ఎంత ప్రేమ ఉన్నదో వివరంగా అర్థమవుతుంది. న్యూస్ 9 వారు, మక్ధూం విడియోలో రికార్డ్ చేసిన దానికి ఇంగ్లీష్ అనువాదం ఇచ్చారు, నేను దాన్ని ఇక్కడ తెలుగులో ఇస్తున్నాను…

నేను ఈరోజు నా జీవితాన్ని అంతంచేసుకుంటున్నాను. దానికి కారణం నేను దారుణంగా మోసపోవడమే. నేను అనేక హింసలను ఎదుర్కొన్నాను, వాటిని భరించడం ఇక నావల్ల కాదు. ముస్కాన్ సెహర్, ఆమె తండ్రి అబ్దుల్ లతీఫ్ నన్ను దారుణంగా మోసం చేశారు. వారు నన్ను ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేశారు. నా కొడుకే నా జీవితం. వారు నన్ను రోజూ తీవ్రంగా బెదిరించే వారు, నన్ను నా కొడుకునుండి దూరం చేశారు. దీని ప్రభావం నేను చేస్తున్న ఉద్యోగం మీద కూడా పడింది. నేను నా కొడుకు రియాన్ మీద ఉన్న ప్రేమ కారణంగా వీరిని భరించాను. వారు నా దగ్గరనుండి 10 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. కానీ, అంత పెద్ద మొత్తములో డబ్బు తేవడం నాకు సాధ్యమయ్యే పని కాదు. తరువాత వారు నా మీద తప్పుడు వరకట్నం కేసును పెట్టారు. నేను ఏ రోజైతె పోలీసు స్టేషను వెల్లవలసి వచ్చిందో, ఆరోజే నేను సగం చచ్చిపోయాను. దాని తరువాత ప్రతీ రోజు చస్తూనే ఉన్నాను. నా కొడుకు నాకు దూరమవ్వడముతో నేను ప్రతీ నిమిషం నరకం అనుభవించాను. వారిని నేను ప్రాధేయపడ్డాను, నేను బాధపడడం వారు చూశారు. వారి కాళ్ళుపట్టుకుని బ్రతిమాలాను. నా కొడుకును నేను పొందడానికి నేను చేయగలిగిన పనులన్నీ చేశాను.

నేను ఎంత బ్రతిమాలినా వారి హృదయాలు కరగలేదు. తరువాత నేను ఈ విషయాన్ని కోర్టుకు తీసుకెల్లాను. నా లాయర్, నా ఫీలింగ్సును పట్టించుకోకుండా, ఆ కేసును సాగదీస్తూ వచ్చాడు. ఈ రోజుతో మూడు సంవత్సరాలు గడిచిపోయాయి. “ఈద్” (పండుగ) కూడా వెల్లిపోయింది, నా కొడుకు పుట్టినరోజుకూడా దాటిపోయింది, కానీ నేను మాత్రం నా కొడుకును కలవలేకపోయాను. నాకు కూతురు కూడా పుట్టింది, కానీ నేను ఆమెను ఒక్కసారి కూడా చూడడానికి నోచుకోలేక పోయాను.

ఇప్పటికి దాదాపుగా ఒక నెల రోజుల నుండీ నేను నా భార్యను బ్రతిమాలుతున్నాను. కానీ, ఆమెకు హృదయం లేదు. దేవుని పేరు మీదుగా నేను ఆమెను వేడుకున్నాను, ఈ డర్టీ గేంలోనికి పిల్లలను తీసుకు రావద్దు అని. కానీ, ఆమె అసలు మనిషే కాదు. నేను ఈరోజు నా జీవితాన్ని అంతం చేసుకుంటున్నాను. అమ్మా, నాన్నా నన్ను క్షమించండి. నా కూతురుని, కొడుకునీ వదిలేసి వెలుతున్నాను. వారిని జాగ్రత్తగా చూసుకోండి.

“నా జీవితం నా కొడుకు కోసమే. నేను మోసగత్తె అయిన నా భార్య చేతిలో మోసపోయాను, ఆమె ఇదివరకే మూడు పెళ్ళిల్లు చేసుకుంది” – ఈ వ్యాఖ్యలు అతని కొడుకుపై అతనికున్న ప్రేమను తెలిపేవే. ఒక్కసారి విడాకులు తీసుకున్న తరువాత, మగవారు పిల్లలకు దూరమవ్వవలసిందే. కస్టడీ ఎవరికి దక్కాలి అన్నది కోర్టు నిర్ణయిస్తుంది. కానీ, సహజంగా అది స్త్రీల పక్షపాతంగానే ఉంటుంది. ఇక్కడ మక్ధూం విషయములో ఇంకా కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వలేదు. వారి విడాకుల కేసు అప్పటికింకా కోర్టులో నడుస్తూనే ఉంది, కస్టడీ కోసం అతను పోరాటం చేస్తున్నాడు. కానీ, ఆపోరాటం అలా సంవత్సరాలు తీసుకుంటూనే ఉంది. అంతవరకూ, అతను అతని కొడుకును కానీ, కొద్దికాలం క్రితమే పుట్టిన కూతురుని కానీ, చూడడానికి అత్తమామలు నిరాకరించారు.

తన బిడ్డలపై ఉన్న ప్రేమతో CRISP అనే సంస్థలో మెంబర్‌గా కూడా జాయిన్ అయ్యాడు, మక్ధూం. CRISP (Children’s Rights Initiative for Shared Parenting) అనే సంస్థ, తండ్రుల హక్కులకోసం పోరాడుతోంది. ఆ సంస్థ ప్రతినిధి కుమార్ జోగిర్దార్ తో ఇంటర్వ్యూ కూడా పైనిచ్చిన విడియోలలో ఉంది (News 9’s 4th video).

అతను ఆత్మహత్యా విడియోతో పాటు, ఒక ఉత్తరాన్ని కూడా రాశాడు. అందులో, అతను తన కొడుకును చూడడానికి తపిస్తున్నానని, కానీ … అతని అత్తమామలు, భార్య అతన్ని కలవనివ్వడం లేదని ఆవేదన చెందాడు. అతని ఆత్మహత్యకు భార్య, అత్తమామలే కారణమని కూడా పేర్కొన్నాడు. ఆ లేఖలోనే తన కొడుకును ఉద్దేశించి ఒక పద్యం కూడా రాశాడు.

To Ryan,

I Know I am not there,
To tell you the stories
I made for you every night

I Know I am not there,
To sing your song and put
You to sleep

I may not be there to teach
you the prayers
I may not be there to start
Our pillow fights

We may not be sharing the
relaxed weekends
When we massaged and took
long baths together

We may not be together to
enjoy
The excitement bike rides and
buy the candies

every night I lay on our bed
I imagine you holding me
tight

It’s you I love, and of you I
think
If you were here I would give
you a squeez,
And ask if you could give me
one please.

Remember my son, you are
everything to me
you are purpose of my
Life and worship
I shall never give upon you
As you are the one who
Makes me complete

సయెద్ మక్ధూం ఆత్మహత్యకు ముందు ఇచ్చిన రికార్డు చేసిన విడియోని కొంత మంది యూట్యూబులో పెట్టారు. న్యూస్ 9 వారి ప్రోగ్రాం కాకుండా అదే డైరెక్టుగా చూడాలనుకుంటే ఇది చూడండి …

ఇక్కడ సమాధానం లేని ప్రశ్నలేమిటంటే, మగవారు ఆత్మహత్య చేసుకుంటే దాన్ని తేలికగా కొట్టి పారేసేవారు చాలా మంది ఉన్నారు. కానీ, ఆడవారు చేసుకుంటే మాత్రమే వారిలో చలనం వస్తుంది. సానుభూతి వెల్లువై పారుతుంది. మక్ధూం ఒక్కడే కాదు, ఇలా ప్రతీ సంవత్సరం 57,000 మంది వివాహిత పురుషులు కుటుంబ సమస్యలతోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 1996 తరువాత ఆత్మహత్యలు 40% పెరిగాయి. ప్రతీ సంవత్సరం 4% శాతం ఆత్మహత్యలు జరుగుతున్నాయి, అదే జననాల రేటు 1% మాత్రమే. అంటే పుట్టేవారికన్న 4% ఎక్కువ మంది మగవారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆడవారితో పోల్చుకుంటే ప్రతీ ఒక్క వివాహిత స్త్రీకి, 1.86 (దాదాపుగా రెట్టింపు సంక్యలో) మంది వివాహిత పురుషులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

ఇంత జరుగుతున్నా, కొందరు వీటిని పట్టించుకోవడం లేదు. దానికి వారు చెప్పే కారణం, ఇది పురుషాధిఖ్య ప్రపంచమని. కానీ, ప్రతీ రోజూకు పెరుగుతూ పోతున్న వీటిని కేవలం ఆసాకును చూపి పట్టించుకోకుండా ఉండడం వెనుక అనేక రాజకీయ కారణాలున్నాయి. అది ఓటు బ్యాంకు కావచ్చు, లేదా కాలం చెల్లిన “సిద్దాంతాలు” కావచ్చు. కారణమేదైనా, ఈ వివక్షను వారు ఎంతకాలం ఇలా చూపుతూ పోతారు? ఇప్పుడు జియాఖాన్ ఆత్మహత్య చేసుకోవడముతో సూరజ్ పంచోలిని పోలీసులు అరెస్టు చేశారు. కొంత మంది దాన్ని స్వాగతిస్తున్నారు. మరికొంత మంది వ్యతిరేకిస్తున్నారు. కానీ, ఇదే విధంగా అనేక మంది కుర్రాళ్ళు ప్రేమలో విఫలమై ఆత్మహత్యలు చేసుకున్నారు, ఆయా కేసుల్లో అమ్మాయిని అరెస్టు చేయగలరా? చేయరు (ఇది నిజం, చాలా కేసుల్లో నిరూపించ బడింది కూడా). దీనికి అంతం ఎప్పుడు?? ప్రస్తుతం మగవారు కూడా అనేక బాధలు ఎదుర్కొంటున్నారనీ, వారికోసం కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉందనీఎప్పుడు గ్రహిస్తారు??

Advertisements

The URI to TrackBack this entry is: https://vishwaveekshanam.wordpress.com/2013/06/13/%e0%b0%9c%e0%b0%bf%e0%b0%af%e0%b0%be%e0%b0%96%e0%b0%be%e0%b0%a8%e0%b1%8d-%e0%b0%86%e0%b0%a4%e0%b1%8d%e0%b0%ae%e0%b0%b9%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af-%e0%b0%92%e0%b0%95-%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a7/trackback/

%d bloggers like this: