ఆప్ ఆద్మీ, "సోంనాథ్ భారతి" పై గృహహింస కేసు – పురుష హక్కుల కార్యకర్తల దృక్కోణం !

నిర్భయ ఘఠన తరువాత, సమాజములో తీవ్రమైన మార్పులే వచ్చాయి. ఆ మార్పు మంచిదా చెడ్డదా అంటే, మంచిదనీ చెప్పలేం, చెడ్డదనీ చెప్పలేం. అది మార్పు అంతే, మచి కాదు చెడు కాదు. సమాజములోని ప్రతీ వ్యక్తి ఆలోచణా విధానముపై అంతో ఇంతో మార్పును తీసుకొచ్చిన ఘఠన అది. సహజంగానే ఇలాంటి వాటిని “ఓట్లు”గా మలుచుకోవడానికి రాజకీయ నాయకులు తమ శక్తివంచన లేకుండా కృషిచేస్తూనే ఉంటారు. ఆ కృషిలో భాగంగానే నిర్భయ ఘఠన తరువాత రాజకీయ నాయకులు “అల్ట్రా ఫెమినిజం”ను పార్టీ అజెండాగా మార్చేసుకున్నారు.

ఇది ఏ ఒక్క పార్టీకో పరిమి తం కాలేదు. దేశములోని అన్ని పార్టీలు ఒకే విధంగా స్పందించడం మొదలు పెట్టాయి. ఇక కమ్యూనిష్టులైతే చెప్పనవసరం లేదు, వారికి సంబందించినంత వరకూ మగవారు భూర్జువాలు, ఆడవారి వర్గ శతృవులు. కుటుంబ వ్యవస్థ, పెళ్ళి ఇవన్నీ అణచివేతకు సహకరిస్తున్న దుర్వవస్థలు. కమ్యూనిజం అనే తమ మతాన్ని ఈ భూమి మీద పూర్తిగా వ్యాపించకుండా అడ్డుకుంటున్న సైతాన్లు. కాబట్టి, వీరు కొంచెం ఎక్కువగానే స్పందించారు. కానీ, ప్రతీ అంశానికీ, బూర్జువా, పెట్టుబడి దారి విధానమే కారణం అనే తమ సిద్దాంతముతో తిరగమాత వేసే అలవాటు కారణంగా వీరిని ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు.

ఇక ఆమ్ ఆద్మీ పార్టీ విషయానికి వస్తే, వారు మిగిలిన వారితో పోలిస్తే నాలుగాకులు ఎక్కువే చదివారేకానీ, తక్కువేమీ చదవలేదు. ఆపార్టీకి చెందిన సోంనాథ్ భారతి, ఆ సమయములో (నిర్భయ ఘఠన జరిగిన సమయములో) ట్విట్టరులో పోస్టు చేసిన ఒక ట్వీట్ చూడండి.

చూశారుగా, స్త్రీని తాకాలన్న ఆలోచన వచ్చినా సరే, వణికిపోయేలా చట్టం చేయాలని కోరుకున్నారు. పార్లమెంటు ఆమోదించిన నిర్భయ చట్టం (మీడియా అలా పిలుచుకుంటుంది. నిజానికి ఆచట్టం పేరు అది కాదు) కూడా దాదాపుగా అలానే ఉంది. స్త్రీకి ఇష్టం లేకుండా తాకినా కూడా నిర్భయ చట్టాన్ని ఉపయోగించవచ్చు. బెయిల్ కూడా దొరకడం కష్టం,  నాన్ బెయిలబుల్ అది. ఈ చట్టం ఎంత లోపభూయిష్టముగా ఉందో తెలియ జేయడానికి ప్రయత్నించింది కేవలం పురుష హక్కుల కార్యకర్తలు మాత్రమే ! ప్రస్తుతం మన దేశములో దుర్వినియోగ మవుతున్న కేసులలో నిర్భయ యాక్ట్ ఉపయోగించి పెడుతున్న కేసులు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నాయి.

ప్రస్తుతం సోంనాథ్ భారతి మీద ఆయన భార్య గృహహింస కేసు నమోదు చేసింది. తనను హింసించే వారని, కొట్టేవారనీ, తన మీదకి కుక్కను కూడా ఉసిగొల్పారని చెబుతున్నారావిడ. ఆమె గృహహింస కేసు నమోదు చేశారని తెలిసిన తరువాత, సోంనాథ్ భారతి స్పందించి, ట్విట్టరులో చేసిన ట్వీట్లు ఇవి…

తన భార్యను తాను ప్రేమిస్తున్నానని, తను ఈవిధంగా కుటుంబ వ్యవహారాన్ని బహిర్గతం చేయడాన్ని భరించలేకున్నానని చెప్పారు, దానికి తోడు ఆవిడ తన మాతృమూర్తికీ, మాతృభూమికీ సేవేచేయడాన్ని వ్యతిరేకిస్తున్నారనీ, ఆవిడ తన మీద తప్పుడు కేసు పెట్టారని ఆక్షేపించారు.

వీరిద్దరిలో, ఎవరివైపు న్యాయముంది అనేది కోర్టులో తేలుతుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, స్త్రీల రక్షణ కోసం ఈ చట్టాలన్నీ దుర్వినియోగానికి గురవుతూ ఉండడం. అవి కక్ష తీర్చుకోవడానికి, భర్తకు, అతని కుటుంబ సభ్యులకు “పాఠాలు” నేర్పడానికి కూడా ఉపయోగించడం చూస్తూనే ఉన్నాం.

ఇక్కడ మేము గర్హించే అంశమేమిటంటే, ఈ చట్టాలు ఎలా వచ్చాయి? అవి దుర్వినియోగం అవుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు ఎందుకు? దీనికి కారణం, సోంనాథ్ భారతి వంటి రాజకీయ నాయకులు కాదా? నిర్భయ ఘఠన జరిగినప్పుడు, అది తమకు రాజకీయంగా ఉపయోగపడుతుంది కాబట్టి… “స్త్రీలను తాకాలన్న ఆలోచన వచ్చినా వనికిపోయేలా” చట్టాలు చేయమని చెబుతారు. ఒక సారి ఆ చట్టాలు వచ్చిన తరువాత, అవి దుర్వినియోగం అవుతే … మగవాడికి రక్షణ ఎలా అని ఆలోచిస్తారా?  చట్టాలు దుర్వినియోగం చేసే వారికి కుడా శిక్షలు ఉండాలి అని అప్పుడే ప్రతి పాదించొచ్చుగా? అలా జరగదు. ఎందుకంటే, అప్పుడు వారికి కేవలం ఓట్లు ముఖ్యం. సెంటిమెంటుకు అనుగునంగా మరికొన్ని వ్యాఖ్యలు చేసి గెలవాలన్న తపన తప్ప మరేమీ ఉండదు.

ఆమ్ ఆద్మీ పార్టీలోని మరి కొంత మంది “ఆప్ ఆద్మీ”లయితే ఒకడుగు ముందుకేసి, 498A కేసులలో భర్తను అరెస్టుచేసే వరకూ పట్టుబట్టి, విద్వంసాలు కూడా సృష్టించిన రోజులున్నాయి. 498A కేసులు ఎలా దుర్వినియోగ మవుతున్నాయో చెప్పాల్సిన పనిలేదు కదా? వాటి గురించి నా బ్లాగులో నేను బాగానే రాశాను. వాటిని చూడాలనుకుంటే 498A అనే లేబులు క్లిక్ చేయండి.

కాకపోతే, మాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే, రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ మార్కండేయ కట్జూ, 498A చట్టం అత్యంత దుర్వినియోగమవుతున్న చట్టాలలో ఒకటన్న విషయాన్ని అంగీకరించడం. ఆయన చేసిన ట్వీట్ చూడండి …

అతితక్కువ కాల వ్యత్యాసములో, ఇద్దరు ప్రముఖ వ్యక్తులు స్త్రీల రక్షణకోసం చేసిన చట్టాలు దుర్వినియోగమవుతున్నాయన్న విషయం అంగీకరించారు. ఇదివరకు వీరువురూ, పురుష హక్కులను ఏమాత్రం పట్టించుకోని వారే కావడం విశేషం.

ఇప్పటికైనా సోంనాథ్ భారతి, ఆమ్ ఆద్మీ పార్టీ, ఈ చట్టాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా పోరాడాలని పురుష హక్కుల కార్యకర్తలు కోరుకుంటున్నారు.

ఇంకో విషయం ఏమిటంటే, సొంనాథ్ భారతి పై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవి. మహిళ మీదకి కుక్కలను ఉసిగొల్పడం చిన్న విషయాలేమీ కావు. కానీ, స్త్రీవాదులు కానీ, కమ్యూనిష్టులు కానీ, ఈ విషయం మీద పెద్దగా స్పందించడం లేదు. ఏవో మొక్కుబడి ఖండనలు తప్ప. ఇదే కనుక ఏ రైట్ వింగ్ రాజకీయ పార్టీకో చెందిన రాజకీయ నాయకుని మీద ఈ ఆరోపణలు వచ్చి ఉంటే.. ఎలా ఉండేదో ఒక్కసారి ఊహించుకోండి. స్త్రీకి రక్షణలేదని, మీడియా ఘోషించేది. కమ్యూనిష్టులు కన్నీరు కుంభ వృష్టిలా కురిపించేసి, సకాలానికి మనకు మాన్సూన్ రాని లోటును తీర్చేసి ఉండేవారు. దురదృష్టవశాత్తూ, వచ్చిన ఆరోపణలు, రైట్ వింగ్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఒక రాజకీయ నాయకుని మీద కావడముతో వారి కలాలు నిలిచిపోయాయి, కంఠాలు మూగవోయాయి.

ఎంతైనా అసమదీయులు అసమదీయులే, తసమదీయులు తసమదీయులే …!!

Advertisements
Published in: on June 14, 2015 at 6:55 pm  Leave a Comment  

The URI to TrackBack this entry is: https://vishwaveekshanam.wordpress.com/2015/06/14/%e0%b0%86%e0%b0%aa%e0%b1%8d-%e0%b0%86%e0%b0%a6%e0%b1%8d%e0%b0%ae%e0%b1%80-%e0%b0%b8%e0%b1%8b%e0%b0%82%e0%b0%a8%e0%b0%be%e0%b0%a5%e0%b1%8d-%e0%b0%ad%e0%b0%be%e0%b0%b0%e0%b0%a4%e0%b0%bf/trackback/

%d bloggers like this: